Amit Shah: మహారాష్ట్ర ప్రతిష్టంభనపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు!

  • ఎన్నికలకు ముందే ఫడ్నవీస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాం
  • నాడు శివసేన అభ్యంతరం చెప్పలేదు
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఆరు నెలల సమయం ఉందన్న అమిత్ షా
రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించగా, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తొలిసారిగా స్పందిస్తూ, కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలకూ 18 రోజుల సమయాన్ని ఇచ్చిన గవర్నర్, ఏ పార్టీ కూడా అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుతో ముందుకు రానందునే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారని అన్నారు. ఇండియాలో ఎన్నికల తరువాత ఏ రాష్ట్రంలోనూ ఇన్ని రోజుల సమయం ఇవ్వలేదని చెప్పారు.

తాజాగా ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించే పార్టీలు, మెజారిటీ ఎమ్మెల్యేలతో వచ్చేందుకు ఆరు నెలల సమయం ఉందని అన్నారు. ఇక శివసేనతో పొత్తుపై స్పందించిన ఆయన, ఎన్నికల ప్రచారంలో భాగంగా, తాను, ప్రధాని నరేంద్ర మోదీ, పలు బహిరంగ సభల్లో తమ కూటమి గెలిస్తే, దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఎన్నో మార్లు చెప్పామని అన్నారు. ప్రజలు తమను నమ్మి కూటమిని గెలిపించారని, సీఎం అభ్యర్థిత్వంపై నాడు అభ్యంతరం చెప్పని శివసేన, ఇప్పుడు సాధ్యం కాని డిమాండ్లను తెరపైకి తెచ్చిందని అన్నారు. ఆ డిమాండ్లు తమకు ఆమోదయోగ్యం కాదని, శివసేన వైఖరి వల్లే ఈ ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు.
Amit Shah
Maharashtra
Elections

More Telugu News