Chandrababu: ఇండియా బ్రాండ్ ఇమేజ్ ను కూడా జగన్ నాశనం చేస్తున్నారు.. మీడియా కథనాలను షేర్ చేసిన చంద్రబాబు
- పీపీఏలపై ఇండియాను జపాన్ ప్రభుత్వం హెచ్చరించింది
- ఐరిష్ మీడియాలో కూడా విమర్శనాత్మక కథనాలు వచ్చాయి
- సింగపూర్ వెళ్లిపోవడంపై ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు
ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న హాస్యాస్పద నిర్ణయాలతో కేవలం ఏపీ మాత్రమే నాశనం కావడం లేదని... పెట్టుబడుల గమ్యస్థానంగా ఉన్న ఇండియా బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ అంశంపై ఏపీ ప్రజలంతా చేతులు కలిపి... వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని ట్వీట్ చేశారు.
విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏల విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై భారత ప్రభుత్వాన్ని జపాన్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించిందని చంద్రబాబు తెలిపారు. ఏపీ మెడ్ టెక్ జోన్ నుంచి ఎలాంటి కారణం లేకుండానే మేధావులను పక్కన పెట్టడంపై ఐరిష్ మీడియా విమర్శనాత్మక కథనాలు రాసిందని చెప్పారు. ఏపీ నుంచి సింగపూర్ ప్రభుత్వం వెళ్లిపోవడంపై పేరుగాంచిన ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని తెలిపారు. వీటితో పాటు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను షేర్ చేశారు.