Rajasekhar: యాక్సిడెంట్ కు గురైన రాజశేఖర్ కారులో మద్యం సీసాలు!

  • ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం
  • కారు వేగం 180 కి.మీ. ఉండొచ్చన్న పోలీసులు
  • ఇప్పటికే రాజశేఖర్ కారుపై మూడు ఓవర్ స్పీడ్ చలానాలు
సినీ హీరో రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తుండగా అప్పా జంక్షన్ వద్ద పెద్ద గోల్కొండ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైనప్పటికీ సకాలంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో రాజశేఖర్ క్షేమంగా బయటపడ్డారు.

మరోవైపు, ప్రమాదానికి గురైన రాజశేఖర్ కారును పోలీసులు సీజ్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేశారు. ఈ కారులో మద్యం సీసాలు లభించాయి. ప్రమాద సమయంలో కారు వేగం 180 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. ఇప్పటికే రాజశేఖర్ కారుపై మూడు ఓవర్ స్పీడ్ చలానాలు ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒకటి, సైబరాబాద్ పరిధిలో రెండు చలానాలు ఉన్నాయి. రూ. 3 వేల జరిమానా పెండింగ్ లో ఉంది.

మరోవైపు ప్రమాద ఘటనపై రాజశేఖర్ స్పందిస్తూ, ఆ సమయంలో కారులో తానొక్కడినే ఉన్నానని తెలిపారు. రామోజీ ఫిలిం సిటీ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగిందని... వేరే కారులో ఉన్నవారు తనను బయటకు తీశారని చెప్పారు. కారు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులకు, తన కుటుంబసభ్యులకు ప్రమాదం గురించి చెప్పానని తెలిపారు.
Rajasekhar
Accident
Tollywood

More Telugu News