Supreme Court: సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర వ్యాఖ్యలు.. అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

  • నాడు మసీదును కూల్చి ఉండకపోతే నేడు ఈ తీర్పు వచ్చి ఉండేది కాదన్న అసద్
  • మధ్యప్రదేశ్‌లోని జహంగీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • ఫిర్యాదు చేసిన న్యాయవాది పవన్ కుమార్
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై మధ్యప్రదేశ్‌లోని జహంగీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పుతో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందని, తనకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో బాబ్రీ మసీదును కూల్చి ఉండకపోతే ఇప్పుడీ తీర్పు వచ్చేది కాదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామంటూనే అదే సర్వోన్నతమైనది కాదని అసద్ వ్యాఖ్యానించారు.

అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఐదెకరాలు కేటాయించాలన్న కోర్టు ఆదేశాలపైనా అసద్ స్పందించారు. తమపై సానుభూతి అవసరం లేదని, దానం అక్కర్లేదని తేల్చి చెప్పారు. తమ పోరాటం మసీదు కోసమే కానీ, భూమి కోసం కాదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంపై నమ్మకం ఉందంటూనే అయోధ్య విషయంలో చివరి వరకు పోరాడతామని అన్నారు.

అసద్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయవాది పవన్‌కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జహంగీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో ఒవైసీపై ఫిర్యాదు చేశారు. పవన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Supreme Court
Ayodhya verdict
Asaduddin Owaisi
case

More Telugu News