High Court Telangana: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

  • న్యాయస్థానాలు చట్ట ప్రకారమే కేసులను పరిష్కరిస్తాయన్న కోర్టు
  • భావోద్వేగాలు, సానుభూతితో కేసులను తేల్చలేవని వ్యాఖ్యలు
  • సమ్మె చట్టవిరుద్ధమని లేబర్ కోర్టు, ట్రైబ్యునల్ ప్రకటించలేదన్న కోర్టు 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ చేస్తోన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రూట్లను ప్రైవేటీకరణ చేయాలని భావిస్తోన్న ప్రభుత్వం రేపటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. ఈ రోజు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులపై నివేదికను కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలు కష్టాలు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణయ్య కోర్టుకు తెలిపారు.

కోర్టు బదులిస్తూ.. న్యాయస్థానాలు చట్ట ప్రకారమే కేసులను పరిష్కరిస్తాయని తెలిపింది. భావోద్వేగాలు, సానుభూతితో కేసులను పరిష్కరించవని స్పష్టం చేసింది. సమ్మె ప్రారంభంలోనే.. విధుల్లో చేరితే చేరండి లేకపోతే లేదని, ప్రభుత్వం కార్మికులకు చెప్పిందంటూ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని నిర్ణయం తీసుకుందని కోర్టు ప్రస్తావించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె చట్టవిరుద్ధమని లేబర్ కోర్టు, ట్రైబ్యునల్ ప్రకటించలేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ ను ఆర్టీసీ సమ్మె కేసుల విచారణలో తోడ్పడాలని కోరింది.  

More Telugu News