Telangana: ఆత్మహత్యకు ముందు కొత్త బట్టలు ధరించి, ఒకర్నొకరు చూసుకుని.... వృద్ధ దంపతుల విషాదాంతం!

  • తెలంగాణలో ఘటన
  • కొడుకు నిరాదరణ భరించలేకపోయిన వృద్ధ దంపతులు
  • పురుగుల మందు తాగి బలవన్మరణం
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. కొడుకు నిరాదరణ, వేధింపులు భరించలేక వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే చనిపోయే ముందు వారు చేసిన పని అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మహదేవ్ పూర్ మండలం ఎలకేశ్వరం గ్రామంలో రాళ్లబండి సాలయ్య, రాధమ్మ అనే దంపతులకు ఓ కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆ వృద్ధులు కొడుకు, కోడలు వద్దే ఉండేవారు. కొడుకు కోసం సాలయ్య ఇల్లు కూడా కట్టించాడు. అయినాగానీ, తమను నిరాదరణకు గురిచేయడం పట్ల ఆ వృద్ధ దంపతులు తట్టుకోలేకపోయారు.

ఎంతో ఆత్మాభిమానంతో బతికిన వారిద్దరూ ఇక బతకడం తమ వల్లకాదని నిర్ణయించుకున్నారు. తమ అంతిమ యాత్రకు అవసరమైన వస్తువులన్నీ ముందే సమకూర్చుకున్నారు. కొత్తబట్టలు ధరించి ఒకరినొకరు కడసారి చూసుకుని, ఆ ఆఖరుక్షణాల్లో కళ్లల్లో కాసింత ఆనందాన్ని నింపుకున్నారు. ఆపై పురుగుల మందు తాగేశారు. సాలయ్య దంపతుల ఆత్మహత్య కంటే వాళ్లు చనిపోయిన విధానం అందరినీ కలచివేసింది.
Telangana
Jayashankar Bhupalpally District
Old Couple
Suicide

More Telugu News