Bhadradri Kothagudem District: కూర విషయంలో గొడవ.. బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భార్య!

  • చర్ల మండలం రాళ్లగూడెంలో ఘటన
  • రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి
  • మనస్తాపంతో అదే బావిలో దూకిన భర్త
భోజనం చేస్తున్నప్పుడు కూర విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ భార్య ఆత్మహత్యకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లగూడెంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీమల సాయికిరణ్, ములుగు జిల్లా రాజుపేటకు చెందిన శైలజ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి పది నెలల పాప ఉంది.

మిల్లులో పనిచేసే సాయికిరణ్ బుధవారం పనికి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో భోజనం చేసేందుకు కూర్చోగా కూర విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో అలిగిన సాయికిరణ్ పనిలోకి వెళ్లిపోగా, మనస్తాపం చెందిన భార్య శైలజ పాపను ఇంటి వద్దే వదిలి గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లి దూకేసింది.

అదే సమయంలో అటువైపు నుంచి వస్తున్న పాఠశాల విద్యార్థులు ఆమెను గమనించి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె భర్త సాయికిరణ్‌కు సమాచారం అందించారు. అతడు ఆగమేఘాల మీద బావి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే బావి వద్దకు చేరుకున్న గ్రామస్థులు శైలజ మృతదేహాన్ని వెలికే తీసే ప్రయత్నాల్లో ఉండగా, భార్య మరణాన్ని తట్టుకోలేని సాయికిరణ్ అకస్మాత్తుగా బావిలో దూకేశాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు అతడిని రక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bhadradri Kothagudem District
wife
suicide

More Telugu News