Vijaya Reddy: 'మమ్మీ ఎప్పుడొస్తుంది?'... అమాయకంగా అడుగుతున్న తహసీల్దార్ విజయారెడ్డి పిల్లలు!

  • నిన్న తహసీల్దారు విజయారెడ్డి దారుణ హత్య
  • అమ్మ ఎప్పుడు వస్తుందని అడుగుతున్న పిల్లలు
  • నేడు విజయారెడ్డి అంత్యక్రియలు
"డాడీ.. మమ్మీకి ఏమైంది? ఎప్పుడొస్తుంది?" అని ఆ ఇద్దరు బిడ్డలూ అమాయకంగా అడుగుతూ ఉంటే, వారికి సమాధానం చెప్పలేక పోతున్న బంధుమిత్రులు, వారిని దగ్గరకు తీసుకుని బోరున విలపిస్తున్నారు. నిన్న అబ్దుల్లాపూర్ మెట్ లో తహసీల్దారు విజయారెడ్డిని దారుణంగా సజీవ దహనం చేయగా, ఇప్పటివరకూ ఆ పిల్లలు తల్లిని చూడలేదు. రోజూ సాయంత్రం తమకు కనిపించే తల్లి కనిపించక పోవడం, ఇంటికి బంధువులంతా రావడంతో, వారెందుకు వచ్చారని కూడా పిల్లలు అడుగుతున్నారు. విజయారెడ్డి దంపతులకు కుమార్తె చైత్ర (10), కుమారుడు భువనసాయి (5) ఉండగా, వారికి ఏం చెప్పి ఊరుకోబెట్టాలని తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు.

నిన్న ఉదయం తన పిల్లలను స్వయంగా స్కూలుకు సిద్ధం చేసి వెళ్లిన విజయారెడ్డి, ఆపై మధ్యాహ్నం సజీవ దహనమైన సంగతి తెలిసిందే. చైత్ర, భువనసాయి సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చి, తల్లి కనిపించక, అమాయకంగా చూస్తూ, అమ్మెక్కడని ప్రశ్నిస్తుంటే, వారికి ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.

కాగా, విజయారెడ్డి అంత్యక్రియలను మంగళవారం అత్తగారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లిలో నేడు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
Vijaya Reddy
Tahasildar
Abdullahpurmet

More Telugu News