Crime News: మాటపడాల్సి వచ్చిందన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికుడు

  • తప్పుడు మనిషంటూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రేయసి కుటుంబానికి ఫోన్‌
  • వారు పెళ్లికి నిరాకరణతో ఆవేదన
  • ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం
ప్రేమ బాసలు చేసుకున్నారు. పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించడంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఫోన్‌ ఆధారంగా తన వ్యక్తిత్వాన్ని ప్రేయసి కుటుంబ సభ్యులు అనుమానించడం, పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. గొల్లపూడికి చెందిన మరికొండ శ్రీను (19), కరకట్టపై నివాసం ఉండే ఓ యువతి ప్రేమించుకున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీను తన పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సరే అన్నారు. అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. వారు కూడా అంగీకరించడంతో దీపావళి అమావాస్య తరువాత పెళ్లి జరిపిద్దామని నిర్ణయానికి వచ్చారు.

ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. ‘శ్రీను మంచివాడు కాదు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి వదిలేశాడు. మీ అమ్మాయినిచ్చి మోసపోకండి’ అంటూ చెప్పారు. దీంతో పునరాలోచనలో పడిన అమ్మాయి తల్లిదండ్రులు విషయం శ్రీనుకు చెప్పి తామీ పెళ్లికి అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.

దీంతో మనస్తాపానికి గురైన శ్రీను ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీను తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Crime News
Vijayawada
gollapudi
suicide

More Telugu News