Maharashtra: వారిద్దరి గొడవ ముగిసేంత వరకు నన్ను ముఖ్యమంత్రిని చేయండి సారూ!: మహారాష్ట్ర గవర్నర్ కు రైతు లేఖ

  • మహారాష్ట్రలో ఇంకా ఏర్పాటు కాని ప్రభుత్వం
  • సీఎం సీటు కోసం బీజేపీ-శివసేనల మధ్య వివాదం
  • రైతులు నష్టపోయిన సమయంలో ప్రభుత్వమే లేదన్న రైతు
ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా మహారాష్ట్రలో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. 50:50 ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు తమకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని శివసేన పట్టుబడుతోంది. శివసేన డిమాండ్ కు బీజేపీ ససేమిరా అంటోంది. దీంతో, ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో, తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి శ్రీకాంత్ గడారే అనే రైతు లేఖ రాశారు. ఎడతెరిపి లేని వర్షాలతో పంటలు నాశనం అయ్యాయని, పెరుగుతున్న అప్పులతో రైతులు అల్లాడిపోతున్నారని బీడ్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షాల కారణంగా నాశనం అయ్యాయని, ప్రకృతి విపత్తులపై రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

రైతులు తీవ్రంగా నష్టపోయిన సమయంలో... ఆదుకోవడానికి ప్రభుత్వం లేదని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో శివసేన, బీజేపీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయని అన్నారు. ఈ పార్టీల సమస్య తీరేంత వరకు ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాలని కోరారు. ముఖ్యమంత్రిగా రైతుల సమస్యలను తాను తీరుస్తానని, వారికి న్యాయం చేకూరుస్తానని చెప్పారు.
Maharashtra
BJP
Shivsena
Farmer
Letter
Governor

More Telugu News