Vijay Sai Reddy: ఇవన్నీ చూసి ఒక ముసలి నక్కకు, ఒక యువ నక్కకు కడుపు మండిపోతోంది: విశాఖలో విజయసాయి వ్యంగ్య వ్యాఖ్యలు

  • సుపరిపాలన ఘనత జగన్ కే దక్కిందన్న విజయసాయి
  • ఓర్వలేకపోతున్నారంటూ టీడీపీ అధినాయకత్వంపై వ్యాఖ్యలు
  • మరో పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు
విశాఖపట్నంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ లపై విమర్శనాస్త్రాలు సంధించారు.  ఐదు నెలల్లోనే సుపరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కిందని అన్నారు. రాష్ట్రంలో ఇన్ని మార్పులు వస్తుంటే, ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఓ ముసలి నక్కకు, ఓ యువ నక్కకు కడుపు మండిపోతోందని ఆరోపించారు. ఆ నక్కలు ఎవరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ప్రజలందరికీ తెలుసని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

 2014లో ముఖ్యమంత్రిగా వచ్చిన ఆ ముసలి నక్క తన హయాంలో సాధించలేనిది ఈ ఐదు నెలల్లోనే జగన్ సాధించడంతో ఓర్వలేకపోతున్నాడని, కడుపుమంటతో విలవిల్లాడిపోతున్నాడని అన్నారు. ఆ ముసలి నక్క రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదని, యువ నక్క సమర్థ నాయకత్వం అందిస్తాడని ప్రజల్లో నమ్మకం లేదని తెలిపారు.

 తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడు గొంతు పిసికి చంపేస్తున్న విషయం అందరికీ తెలుసని, మామ పెట్టిన పార్టీని వెన్నుపోటుతో హస్తగతం చేసుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు స్వంత ప్రయోజనాల కోసం టీడీపీనే పణంగా పెట్టి మరో పంచన చేరేందుకు పన్నాగాలు పన్నుతున్న దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు. ఒకప్పుడు జాతీయ స్థాయి నాయకుడిగా వెలుగొందిన చంద్రబాబు ఇవాళ జాతి నాయకుడిగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. సుజనా, సీఎం రమేశ్ తదితరులను చంద్రబాబే పంపిస్తున్నారని, అభద్రతా భావంతో వారిని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి పంపుతున్నారని ఆరోపించారు.
Vijay Sai Reddy
Chandrababu
Nara Lokesh
Andhra Pradesh
Vizag

More Telugu News