Ravi Shastry: షూలేసులు కట్టుకోవడం రానివారు కూడా ధోనీ గురించి మాట్లాడుతున్నారు: రవిశాస్త్రి ఫైర్

  • ధోనీ 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు  
  • రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటించాలో ధోనీకి తెలుసు
  • ఆలోచించకుండా వ్యాఖ్యలు చేయవద్దు
భారత క్రికెజ్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి తాను కోరుకున్న సమయంలో రిటైర్మెంట్ ప్రకటించే హక్కు ఉన్నదని.. కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ధోనీ రిటైర్మెంట్ పై మాట్లాడే వారిలో చాలామందికి షూలేసులు కూడా కట్టుకోవడంరాదని మండిపడ్డాడు. ప్రపంచకప్-2019 సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ ఆడిన మ్యాచ్ లో పాల్గొన్న ధోనీ అనంతరం మళ్లీ ఆడలేదు. జులై 30న టెర్రిటోరియల్ ఆర్మీలో చేరిన ధోనీ జమ్మూ కశ్మీర్ లో సేవలందించాడు.

దీంతో ధోనీ వెస్టిండీస్ పర్యటనకు, భారత్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన పొట్టి ఫార్మాట్ సిరీస్ కు దూరమయ్యాడు. తాజాగా బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ కు ఎంపిక చేసిన భారతజట్టులో కూడా ధోనీ లేకపోవడంతో... ఇక ఆయన పని అయుపోయిందని, త్వరలో రిటైర్మెంట్ ప్రకటన చేస్తారని పలువురు చిన్నా పెద్ద క్రికెటర్లు వ్యాఖ్యానిస్తుండటంతో రవిశాస్త్రి సీరియస్ అయ్యాడు.

‘భారత జట్టుకు ధోనీ 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. క్రికెట్ నుంచి ఎప్పుడు వైదొలగాలో అతనికి తెలుసు. అతను రిటైర్ కావాలని మీరు ఎందుకు తొందర పడుతున్నారు? టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ధోనీ ఏమన్నాడో తెలుసా, వృద్ధిమాన్ సాహకు వికెట్ కీపర్ బాధ్యతలు అప్పజెప్పవచ్చు. అతనికి ఆ సామర్థ్యముందన్నాడు. తాను ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో ఆయనకు తెలియదా? షూలేస్ కూడా కట్టుకోవడం రాని వారు ధోనీ రిటైర్మెంట్ పై మాట్లాడుతున్నారు’ అని రవిశాస్త్రి మండిపడ్డాడు.
Ravi Shastry
MS Dhoni
Cricket

More Telugu News