Nara Lokesh: జగన్ ఇసుకాసురుడి అవతారమెత్తి కార్మికులను మింగేస్తున్నారు: నారా లోకేశ్

  • గుంటూరులో మేస్త్రీల ఆత్మహత్య బాధాకరమన్న లోకేశ్
  • వాళ్ల కుటుంబాల్లో విషాదం నింపారంటూ జగన్ పై మండిపాటు
  • ఇసుక అక్రమాలపై ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
ఏపీలో ఇసుక కొరత కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపుతోందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. ఇసుకాసురుడి అవతారమెత్తిన సీఎం జగన్ భవన నిర్మాణ రంగ కార్మికులను మింగేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో ఒకే రోజు బ్రహ్మాజీ, వెంకట్రావు అనే మేస్త్రీలు ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం అని ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరత, జే ట్యాక్స్ కారణంగా ఇద్దరు కార్మికులు బలైపోయారు, 'పండుగ పూట వాళ్ల కుటుంబాల్లో విషాదం నింపారు కదా జగన్ గారూ' అంటూ ట్వీట్ చేశారు.

మృతి చెందిన మేస్త్రీల కుటుంబాలకు ఇప్పుడు దిక్కెవరో చెప్పాలని నిలదీశారు. 'మీ సర్కారు నిర్లక్ష్య వైఖరికి శ్రమజీవులు బలవ్వాలా?' అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితి మీ మనస్సాక్షికి తెలియడం లేదా? లేక తెలిసి కూడా నటిస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని పక్కనబెట్టి మీ ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే ఇసుక అంశంపై టీడీపీ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతుందని హెచ్చరించారు.
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News