Imran Khan: ప్రధాని పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: ఇమ్రాన్ ఖాన్ స్పష్టీకరణ

  • ఇమ్రాన్ రాజీనామాకు విపక్షాల డిమాండ్
  • ఈ నెల 31న ధర్నాకు పిలుపునిచ్చిన ఉలేమా-ఏ-ఇస్లామ్
  • భారత్ కు లబ్ది చేకూర్చే ప్రయత్నమన్న ఇమ్రాన్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించారు. ప్రధాని పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఉలేమా-ఏ-ఇస్లామ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఈ నెల 31న ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ పార్టీ, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కూడా మద్దతు పలకడంతో మీడియా మొత్తం ఇటువైపే దృష్టి సారించింది.

గత ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ రిగ్గింగ్ చేసి గెలుపొందారని మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఆరోపిస్తున్నారు. అక్రమ మార్గంలో గెలిచిన ఇమ్రాన్ కు ప్రధాని పదవిలో కొనసాగే హక్కులేదని విమర్శిస్తున్నారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు.

"మౌలానా (ఫజ్లుర్) సమస్య ఏంటో నాకు అర్థం కావడంలేదు. ఇప్పుడు ధర్నా చేయడం ద్వారా భారత్ కు సంతోషం కలిగిస్తున్నారు. మౌలానా ధర్నా వార్తలతో భారత మీడియా సంబరాలు చేసుకుంటోంది. ఈ నిరసన ప్రదర్శన కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని పక్కకు మళ్లిస్తుంది. దీనివల్ల ఎవరికి లబ్ది చేకూరుతుందో మనం ఆలోచించాలి" అని హితవు పలికారు.
Imran Khan
Pakistan
India
Jammu And Kashmir

More Telugu News