Bangladesh: భారత్ లో బంగ్లాదేశ్ జట్టు పర్యటనకు లైన్ క్లియర్... సమ్మె విరమించిన ఆటగాళ్లు

  • చల్లారిన బంగ్లా క్రికెట్ సంక్షోభం
  • క్రికెటర్ల డిమాండ్లకు బోర్డు సానుకూల స్పందన
  • భారత్ పర్యటనకు వెళుతున్నామని షకీబల్ వెల్లడి
బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మె విరమించారు. 11 డిమాండ్లతో ఉన్నట్టుండి సమ్మెకు దిగడం ద్వారా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఆటగాళ్లు శాంతించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో తమ చర్చలు సఫలం అయ్యాయని, డిమాండ్లపై బోర్డు నుంచి సానుకూల స్పందన వచ్చిందని సీనియర్ ఆటగాడు షకీబల్ హసన్ తెలిపాడు.

దేశవాళీ ఆటగాళ్లు శనివారం నుంచి ఆటలో భాగమవుతారని, జాతీయ జట్టు షెడ్యూల్ ప్రకారమే భారత్ పర్యటనకు వెళుతుందని వివరించాడు. అటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మాట్లాడుతూ, ఆటగాళ్లు 11 డిమాండ్లు చేయగా, వాటిలో రెండింటిని మినహాయించి 9 డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, బంగ్లాదేశ్ జట్టు నవంబర్ 3 నుంచి భారత్ లో పర్యటించనుంది.
Bangladesh
India
Cricket

More Telugu News