bsp: పార్టీ టికెట్లు అమ్ముకున్నారట.. బీఎస్పీ నాయకులను గాడిదలపై ఊరేగించిన కార్యకర్తలు!

  • పార్టీ కార్యాలయం వద్దే ఘటన
  • ముఖాలకు నల్లరంగు పూసి, చెప్పుల దండ వేసి ఊరేగింపు
  • సిగ్గుపడాల్సిన విషయమన్న అధినేత్రి మాయావతి
పార్టీ టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఇద్దరు బీఎస్పీ నేతల ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి గాడిదలపై ఊరేగించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిందీ ఘటన. జాతీయ కార్యదర్శి రాంజీ గౌతమ్, రాష్ట్ర మాజీ ఇన్‌చార్జ్ సీతారాంలకు ఈ పరాభవం జరిగింది. వీరిద్దరూ పార్టీ టికెట్లను అమ్ముకున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బనిపార్క్‌లోని పార్టీ కార్యాలయం వద్ద వీరిని పట్టుకున్న కార్యకర్తలు ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి ఇద్దరినీ గాడిదలపై కూర్చోబెట్టి ఊరేగించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని నేతలు విస్మరిస్తున్నారని ఆరోపించారు. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని కాదని, బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. వారి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదని, సమస్య అధినేత్రి మాయావతి వరకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అందుకనే వారిని గాడిదలపై ఊరేగించాల్సి వచ్చిందన్నారు. విషయం తెలిసిన మాయవతి ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమన్న ఆమె.. దీనిపై విచారణ జరిపిస్తామని తెలిపారు.
bsp
mayawati
Rajasthan
jaipur

More Telugu News