IYR: 'రమణ దీక్షితులు' అంశాన్ని తేల్చండి: జగన్ కు ఐవైఆర్ కృష్ణారావు వినతి!

  • అర్చకుల సమస్యలను పరిష్కరించండి
  • గత వాగ్దానాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి
  • అర్చకులకు నెలకు రూ. 15 వేల వేతనం ఇవ్వండి
  • ట్విట్టర్ లో జగన్ ను కోరిన ఐవైఆర్
టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుతో పాటు ఇతర దేవాలయాల్లో అర్చకులు నిత్యమూ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఏపీ సీఎం జగన్ ను కోరారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు.

"తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రమణ దీక్షితులు అదే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర అర్చకుల సమస్యపై దృష్టి పెట్టి తన వాగ్దానానికి అనుగుణంగా సత్వర చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.

ఆపై "ముఖ్యమంత్రి గారు హిందూ ధర్మ పరిరక్షణ వ్యాప్తికి అవసరమైన ఇతర చర్యలు, దైవభక్తి కలిగిన వారితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయడం, అర్చకులకు కనీస వేతనం నెలకు 15000  (ప్రభుత్వ బడ్జెట్ అవసరం లేకుండా దీనిని ఏర్పరచవచ్చు), సమరసత సేవా సమితికి గ్రాంట్లు పునరుద్ధరించడం, అందుకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.

ఇంకా "ఆలయ పరిరక్షణ ఉద్యమాన్ని నడిపి బలవంతుడైన నిరంకుశ ముఖ్యమంత్రిని ఢీకొని చిన్న దేవాలయాల మనుగడే తన జీవిత లక్ష్యంగా పనిచేసిన చిల్కూర్ బాలాజీ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారి పుట్టిన రోజున ఈ ఉత్తర్వులు రావడం ముదావహం" అన్నారు.

"గ్రామీణ ప్రాంతంలోని చిన్న దేవాలయాల అర్చకుల చిరకాల వాంఛకు రూపం ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎప్పుడో రొటీన్ గా రావాల్సిన ఉత్తర్వులు బాబుగారి వైఖరి వల్ల ఇన్ని రోజులు వాయిదా పడింది" అని కూడా ట్వీట్ చేశారు.
IYR
IYR Krishnarao
Jagan
Ramana Deekshitulu

More Telugu News