Chittoor District: ఆంధ్రాబ్యాంక్‌లో బంగారం చోరీ ఇంటి దొంగల పనే.. ఉద్యోగులే సూత్రధారులు!

  • బీఎం, క్యాషియర్‌, అప్రైజర్‌ పాత్ర
  • ఇటీవల బ్యాంకు నుంచి 17 కిలోల ఆభరణాలు చోరీ
  • కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
యాదమరి ఆంధ్రాబ్యాంకు శాఖలో జరిగిన భారీ చోరీ ఇంటి దొంగల పనేనని, ఉద్యోగులే కీలక సూత్రధారులని పోలీసులు నిర్థారణకు వచ్చారు. బ్రాంచి మేనేజర్‌, క్యాషియర్‌, అప్రైజర్‌ కలిసి ఈ చోరీకి పథక రచన చేసి అమలు చేశారని నిర్ధారించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.  

చిత్తూరు జిల్లా యాదమరి మండల పరిధి చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో మోర్థానపల్లి వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో గత సోమవారం 3.45 కోట్ల విలువైన 17 కిలోల బంగారు ఆభరణాలు, 2.66 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదుచేసి విచారణ చేసిన పోలీసులు పలు ప్రాథమిక అంశాలు గుర్తించారు.

బ్యాంక్‌లోని సీసీ కెమెరాల పుటేజీ నిక్షిప్తం చేసే హార్డ్‌ డిస్క్‌ ముందుగానే మాయం కావడం, బ్యాంకు ప్రధాన ద్వారం, బ్యాంకు లోపలి లాకర్‌ తాళాలు యథాతథంగా ఉండడం, లాకర్‌లోని ఆభరణాలు మాత్రం మాయం కావడం చూసి కచ్చితంగా బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉందని పోలీసులు అనుమానించారు.  అందుకే ఆ కోణంలోనే విచారణ ప్రారంభించి తొలుత బ్యాంక్‌ మేనేజర్‌ పురుషోత్తాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.

అనంతరం క్యాషియర్‌ నారాయణను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం ఆరోపణలు సంధించుకోవడంతో  ఇద్దరి కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం ప్రధాన మార్గాల్లోని సీసీ కెమెరా పుటేజీ, కాల్‌ రికార్డులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. దీంతో బ్రాంచి మేనేజర్‌, క్యాషియర్‌తోపాటు అప్రైజర్‌ పాత్ర ఉన్నట్లు తేల్చారు.

ముగ్గురూ పథకం ప్రకారం బ్యాంకు ఆభరణాలు చోరీ చేసి వివిధ ప్రాంతాల్లో దాచారని గుర్తించారు. కొంత బంగారాన్ని బ్యాంకు పరిసరాల్లోని గుట్టల్లోనే పూడ్చిపెట్టారు. చోరీ అయిన బంగారంలో సగం వరకు స్వాధీనం చేసుకున్నారు. కొంత బంగారాన్ని నిందితులు కరిగించారు. దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Chittoor District
yadamari
andhrabank
Crime News
robery
mistery traced

More Telugu News