kalki bhagavan: తెలుగు, తమిళ రాష్ట్రాల్లో 'కల్కి' లీలలు : గుట్టలుగా నోట్ల కట్టలు, బంగారం

  • రూ.600 కోట్లకు పైగా సొత్తు
  • క్లయింట్లు ఇచ్చిన డబ్బుతో విదేశాల్లో పెట్టుబడులు
  • ఎల్‌ఐసీ ఏజెంట్‌ స్థాయి నుంచి అందనంత ఎత్తుకు
ఆశ్రమం గుట్టు రట్టయింది. ఆధ్యాత్మిక వేత్త అసలు బండారం బయటపడింది. దీంతో కల్కి భగవాన్‌..ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో మారుమోగుతున్న పేరు ఇది. ఓ సాధారణ ఎల్‌ఐసీ ఏజెంట్ వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన వైనం వెనుక ఉన్న మిస్టరీ అర్థంకాక ఆయన భక్తులే కాదు, సామాన్యులు జుత్తు పీక్కుంటున్నారు. తాను భగవంతుని పదో అవతారంగా చెప్పుకుంటూ భక్తుల బలహీనత నుంచి రాబట్టుకున్న డబ్బుతో కోట్లకు పడగలెత్తినట్టు బయటపడుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. కల్కి ఆశ్రమమే ఓ మిస్టరీ. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ దాడులతో ఈ మిస్టరీ బద్దలవుతుండడం కలకలానికి కారణమైంది.

కల్కి ఆశ్రమాలపై ఈనెల 16న ఐటీ అధికారులు దాడులు మొదలు పెట్టారు. ఆశ్రమానికి సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఉన్న కేంద్రాల్లోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. తొలిరోజు దాడుల్లోనే స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాల విలువ రూ.93 కోట్లు ఉంటుందని తేల్చారు. ఇందులో 43.9 కోట్లు నగదు రూపంలో ఉండగా, రూ.18 కోట్ల విలువైన అమెరికన్‌ డాలర్లు, 26 కోట్ల విలువ చేసే 88 కిలోల బంగారం, రూ.5 కోట్ల విలువ చేసే 1271 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి.

అయితే లెక్క తేలని ఆదాయం మరో రూ.500 కోట్ల వరకు ఉంటుందని ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. కల్కి అనుబంధ సంస్థలు చైనా, అమెరికా, సింగపూర్‌, యూఏఈల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు గుర్తించారు. దేశీయంగా కల్కి సంస్థలు నిర్వహిస్తున్న కోర్సులకు దేశవిదేశాల నుంచి క్లయింట్లు హాజరవుతుంటారు.

వారి నుంచి వచ్చే డబ్బులో పన్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని తమ గ్రూపు కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. అలాగే, విదేశీ క్లయింట్ల నుంచి నగదు రూపంలో తీసుకుంటున్న మొత్తానికి కూడా సరిగా లెక్కలు చూపడం లేదని తేల్చారు.
kalki bhagavan
Andhra Pradesh
Telangana
Tamil Nadu
IT raides

More Telugu News