Ranjan Gogoi: అయోధ్య తీర్పు కోసం యావత్ భారతం ఎదురుచూపులు.... విదేశీ పర్యటన రద్దు చేసుకున్న రంజన్ గొగొయ్

  • అయోధ్య కేసులో తీర్పు ప్రకటించాలన్న ఉద్దేశంతో నిర్ణయం!
  • నవంబర్ 17న పదవీ కాలం పూర్తి
  • ఈలోగా తీర్పు వెలువరించే అవకాశం
అయోధ్య భూవివాదం కేసు తీర్పు దృష్ట్యా  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ తన విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారు.  విదేశీ పర్యటనలో భాగంగా గొగొయ్ దుబాయ్, ఈజిఫ్టు, బ్రెజిల్ దేశాల్లో పర్యటించి ఈ నెలాఖరుకు భారత్ తిరిగి రావాల్సి ఉంది.  దీర్ఘ కాలంగా విచారణ కొనసాగిన అయోధ్య భూవివాదం కేసులో వాద ప్రతివాదనలు పూర్తి కావడంతో  సుప్రీం కోర్టు తుది తీర్పు రిజర్వులో పెట్టింది. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ వివాదంలో తీర్పును ప్రకటించాలన్న ఉద్దేశంతో గొగొయ్ తన విదేశీ పర్యటన విరమించుకున్నారని సమాచారం.

ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మొత్తం నలబై రోజులపాటు వాద ప్రతివాదనలు విన్నది. మరో పక్క గొగొయ్ పదవీ కాలం వచ్చే నెల 17న పూర్తి కానుండటంతో... అంతకు ముందే చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించాలని గొగొయ్ ఉత్సుకతతో ఉన్నారు.
Ranjan Gogoi
Ayodhya
Supreme Court

More Telugu News