Vijayawada: మహేశ్‌బాబు, మోదీ వస్తేనే దిగుతా.. విజయవాడలో మహిళ చెట్టెక్కి హల్‌చల్

షార్ట్స్‌లో చూడండి
విజయవాడలో ఓ యువతి మంగళవారం చెట్టెక్కి హల్‌చల్ చేసింది. మహేశ్‌బాబు రావాలని, మోదీతో మాట్లాడాలంటూ నానా రభస చేసింది. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఆమెను కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెవెన్యూ కాలనీలోని అగ్రిగోల్డ్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కిన యువతి పెద్దపెద్దగా కేకలు వేసింది. దీంతో జనం అక్కడ గుమిగూడారు. ఆమెను కిందికి దింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్థానికులు పోలీసు కంట్రోలు రూముకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న మహిళా మిత్ర పోలీసులు యువతిని చెట్టు దిగమని నచ్చజెప్పారు. వారి మాటలు వినించుకోని యువతి నటుడు మహేశ్‌బాబు రావాలని, మోదీతో మాట్లాడాలని చెప్పింది. అలాగే, జగన్ కూడా తన మొర ఆలకించాలంటూ కేకలు వేసింది. గుమిగూడిన జనం ఆమెను వీడియోల్లో బంధిస్తుంటే చెట్ల కొమ్మలు విరిచి వారిపై పడేసింది. ఆమె చెబుతున్నదేంటో, ఆమె డిమాండ్ ఏంటో తెలియక అక్కడున్నవారు అయోమయానికి గురయ్యారు. చివరికి ఆమె మతిస్థిమితం కోల్పోయిన మహిళగా గుర్తించారు.

ఇది చూసిన జనం పెద్ద ఎత్తున అక్కడికి తరలిరావడంతో మహిళ మరింత పైకి చేరుకుంది. చివరికి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని వలలు వేసి నిచ్చెన సాయంతో ఆమెను కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన పేరు అనిత అని, తనది కోల్‌కతా అని చెప్పిన యువతి తనను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారంటూ రకరకాలుగా మాట్లాడుతుండడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Vijayawada
tree
woman
Mahesh Babu

More Telugu News