Chandrababu: రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీతో యుద్ధం.. ఆయనతో వ్యక్తిగత విరోధం లేదు: చంద్రబాబు

  • విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు
  • నాలుగు నెలల్లోనే జగన్ అమరావతిని ముంచేశారని విమర్శ
  •  ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్ కోతలు
ప్రధాని నరేంద్రమోదీతో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విరోధం లేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆయనతో పోరాడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. విశాఖపట్టణంలో పర్యటిస్తున్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము తొలి నుంచీ రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యమిచ్చామన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాజధాని అమరావతిని ముంచేశారని, ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత వల్ల గత ఐదేళ్లలో రాని విద్యుత్ కోతలు ఇప్పుడు వచ్చాయని విమర్శించారు. శ్మశానాలను కూడా వైసీపీ రంగులతో నింపేస్తున్న నాయకులు వారి ముఖాలకు కూడా ఆ రంగు వేసుకుంటే బావుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టీడీపీ తన వంతు పాత్ర పోషిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu
Jagan
Andhra Pradesh
Visakhapatnam

More Telugu News