Chandrababu: భయపడకుండా పోరాడితే జగన్ పులివెందుల పారిపోవడం ఖాయం: చంద్రబాబు

  • రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పనులు చేస్తున్నారు
  • ‘నవరత్నాలు’ నవగ్రహాలుగా మారిపోవడం ఖాయం
  • టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. విశాఖపట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా విస్తృత స్థాయి  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పనులు చేస్తున్నారని, జగన్ పాలనలో మాట తప్పడం తప్పితే మరేం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ హామీలు ‘నవరత్నాలు’ పై విమర్శలు చేశారు. త్వరలోనే ‘నవరత్నాలు’ నవగ్రహాలుగా మారిపోతాయని జోస్యం చెప్పారు. 

ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. నాలుగు నెలల్లో 14 మంది టీడీపీ కార్యకర్తలను చంపేశారని, 570 చోట్ల దాడులు చేశారని ఆరోపించారు. వైసీపీ దాడుల కారణంగా టీడీపీ కార్యకర్తలు గ్రామాలు వదిలి వెళ్లే పరిస్థితి వచ్చిందని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ‘టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్’ అని హెచ్చరించారు. భయపడకుండా పోరాడితే జగన్ పులివెందుల పారిపోవడం ఖాయమని అన్నారు.

‘ఓడిపోయామని భయపడవద్దు, ప్రజల పక్షాన పోరాడండి’ అని పిలుపు నిచ్చారు. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపు నిస్తే తన ఇంటి గేట్లకు తాళ్లు కట్టారని, ‘నా ఇంటి గేట్లకు కట్టిన తాళ్లు మీకు ఉరితాడుగా మారతాయి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రౌడీ గవర్నమెంట్ ఉంది అని, ప్రతిపక్షాన్ని ఎంతగా అణచివేయాలని చూస్తే అంతగా పైకి లేస్తుందని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీలో రివర్స్ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ కు చేపట్టింది ‘రివర్స్ టెండరింగ్ కాదు రిజర్వ్ టెండరింగ్’ అని ఆరోపించారు.
Chandrababu
Telugudesam
YSRCP
jagan

More Telugu News