USA: కృష్ణా జిల్లా అమ్మాయిని వలచి, మనువాడిన అమెరికా అబ్బాయి!

  • యూఎస్ లో ఉద్యోగం చేస్తున్న నాగసంధ్య
  • ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆడమ్ బ్యాంగ్ తో పరిచయం
  • వివాహానికి అంగీకరించిన పెద్దలు
ప్రేమకు ప్రాంతీయ భేదాలు, కులమతాలు లేవని మరోసారి నిరూపితమైంది. వారిద్దరి ప్రేమ ఖండాంతరాలను దాటింది. అమెరికాకు చెందిన ఓ యువకుడు, ఆంధ్రా అమ్మాయిని ప్రేమించి, హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లాడాడు.

వివరాల్లోకి వెళితే, విజయవాడ, గూడవల్లికి చెందిన గుంటక సత్యహరినాథరెడ్డి కుమార్తె నాగ సంధ్య, యూఎస్ లోని ఫ్లోరిడా వర్శిటీలో పీహెచ్డీ చేసింది. ఆపై ఒరెగాన్ లోని ఇంటెల్ కార్పొరేషన్ లో టెక్నాలజీ డెవలప్ మెంట్ అధికారిణిగా పనిచేస్తోంది. అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆడమ్ బ్యాంగ్ తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా రూపాంతరం చెందింది. ఒకరిని విడిచి ఒకరం ఉండలేమన్న భావనకు వచ్చారు.

ఆపై తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలిపారు. వారి మనోభావాలను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. పండితులు ముహూర్తం నిర్ణయించగా, విజయవాడలోని ఏబీ కన్వెన్షన్ సెంటర్, వీరి వివాహానికి వేదికైంది. చూడముచ్చటగా ఉన్న ఈ జంటను చూసేందుకు అతిథులు పెద్దఎత్తున తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ రూరల్ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
USA
Andhra Pradesh
Marriage
Vijayawada

More Telugu News