Andhra Pradesh: అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఏపీ మంత్రి వెల్లంపల్లి

  • అర్చకులతో వెల్లంపల్లి సమీక్ష
  • ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరిన అర్చకులు
  • అర్చకత్వం  కొనసాగించేందుకు చర్యలు చేపడతాం: వెల్లంపల్లి
ఏపీలో అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికలకు ముందు అర్చకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సీఎం జగన్ ని అర్చక సమాఖ్య నాయకులు కలిశారు. జగన్ ఆదేశాల మేరకు అర్చకులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. జీవో నెంబర్ 76 ను అమలు చేయాలని, ధార్మిక పరిషత్ అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అర్చక సంఘాలు కోరాయి. దీనిపై స్పందించిన వెల్లంపల్లి సబ్ కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే అర్చకుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

దేవాలయ భూములు, ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వం నిర్వహణపై కీలక చర్చ జరిగింది. అర్చక వారసత్వ హక్కుల ప్రకారం అర్చకత్వం కొనసాగించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా అర్చకత్వం నిర్వహించే విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు తీరు పరిశీలిస్తామని చెప్పారు. డీడీఎస్ స్కీమ్ కింద ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని10 వేలకు పెంచేందుకు, రూ.10,000 ఉన్న భృతిని రూ.16,500 కు పెంచేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం 1600 దేవాలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలవుతోందని, ఈ పథకాన్ని 3,600 దేవాలయాలకు వర్తించేలా చర్యలు చేపడతామని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన ధార్మిక పరిషత్తు, అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అర్చకులకు హెల్త్ కార్డులు ఇస్తామని వివరించారు. దేవాదాయ కమిషనర్ కార్యాలయం సముదాయంలో ఉన్న అర్చక సంక్షేమ భవనాన్ని విస్తరిస్తామని హామీ ఇచ్చారు.

కాగా, ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో  ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ పద్మ, తిరుపతి జేఈఓ బసంత్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అర్చక సమాఖ్య, బ్రాహ్మణ సమైక్య నాయకులు, పురోహితులు, 13 జిల్లాల నుంచి హాజరైన బ్రాహ్మణ సంఘాల నాయకులు హాజరయ్యారు.
Andhra Pradesh
minister
Vellampalli
Srinivas

More Telugu News