cm: జగన్ గారూ! ఆటో డ్రైవర్లు భయపడుతున్నారు: నారా లోకేశ్

  • వైఎస్సార్ వాహన మిత్ర పథకంపై లోకేశ్ విమర్శలు
  • ఇది ‘వైఎస్సార్ వాహన కక్ష పథకం’
  • మేనిఫెస్టోలో చెప్పని నిబంధనలు పథకం అమలప్పుడు ఎందుకు పుట్టుకొస్తాయి?
వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ఏపీ సీఎం జగన్ ఈరోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందజేయనున్నారు. ఇదిలా ఉండగా, ఏపీ సీఎం జగన్ పై, ప్రభుత్వ పథకాలపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేత నారా లోకేశ్ ఈ పథకాన్నీ వదల్లేదు. ఈ పథకాన్ని ‘వైఎస్సార్ వాహన కక్ష పథకం’గా అభివర్ణిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

ఈ పథకాన్ని చూసి ఆటో డ్రైవర్లు భయపడుతున్నారని, వైసీపీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, అడుగుతున్న సర్టిఫికెట్ల కోసం తిరిగేందుకు అయ్యే ఖర్చుతో కొత్త ఆటో కొనుక్కోవచ్చని భావిస్తున్నారని విమర్శించారు. ఓ లెక్క ప్రకారం రాష్ట్రంలో సుమారు 6.63 లక్షల మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని, ఈ పథకం అమలుకు రూ.663 కోట్లు కేటాయించాలని, అలాంటిది ప్రభుత్వమే రూ.400 కోట్లు మంజూరు చేసిందంటే అర్థమేంటి? అర్హుల సంఖ్యను తగ్గించమనే కదా! అని విమర్శించారు.

అధికారులు ఇంకొంచెం ముందుకెళ్ళి అర్హుల సంఖ్యను 1.73 లక్షలకు కుదించారని ఆరోపించారు. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పని నిబంధనలన్నీ పథకం అమలు చేసేటప్పుడు ఎందుకు పుట్టుకొస్తాయి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? లేక మోసం చెయ్యడం జగన్ కు కొత్త కాదు కనుక ఇప్పుడు కూడా అలాగే చేశామంటారా? అని తన ట్వీట్లలో లోకేశ్ ప్రశ్నించారు.
cm
Jagan
YSRCP
Telugudesam
Nara Lokesh

More Telugu News