Chandrababu: ఈ ఆంబోతులు ఓ నేరచరిత కలిగిన వ్యక్తిని అడ్డంపెట్టుకుని ఏం చేసినా జరిగిపోతుందనుకుంటున్నారు: చంద్రబాబు
- తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు
- సిగ్గుందా, బుద్ధుందా అంటూ తీవ్ర ఆగ్రహం
- తన వ్యక్తిత్వాన్ని ఎవరూ చాలెంజ్ చేయలేరంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపైనా, పార్టీ నేతలపైనా సామాజిక మాధ్యమాల్లో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ ఆంబోతులు ఓ నేరచరిత కలిగిన వ్యక్తిని అడ్డంపెట్టుకుని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారని మండిపడ్డారు. వీళ్లను ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. వైసీపీ దురాగతాలకు ఉదాహరణ అంటూ ఓ విజువల్ క్లిప్పింగ్ ను ప్రదర్శించారు.
ఇటీవల మాచర్ల వెళ్లినప్పుడు ఓ మహిళ తన కాళ్లు పట్టుకుని గోడు వెళ్లబోసుకున్న ఘటనపై మీడియాలో వచ్చిన వార్తను వ్యంగ్యంగా మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు. బాధిత మహిళ స్థానంలో తన కుమారుడు నారా లోకేశ్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి పెట్టడం దారుణమని వాపోయారు. ఆ మార్ఫింగ్ పిక్ గురించి వివరిస్తూ, లోకేశ్ తన కాళ్లు పట్టుకోవడానికి రాగా, ఎక్కడో చూసినట్టుంది ఈమెను అంటూ తాను అడిగినట్టు, ఫిమేల్ ఆర్టిస్టులు ఎవరూ రాలేదు నాన్నారూ, నేనే చీరకట్టుకుని వచ్చా అంటూ లోకేశ్ చెప్పినట్టు చిత్రీకరించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఇంతవరకు ఎవరూ తన వ్యక్తిత్వాన్ని చాలెంజ్ చేయలేకపోయారని చంద్రబాబు స్పష్టం చేశారు. విశ్వసనీయతే తనకు అండ అని తెలిపారు. తూర్పుగోదావరి నుంచి వచ్చిన ఓ అమ్మాయి గురించి బరి తెగించిందంటూ మరీ దారుణంగా ప్రచారం చేస్తున్నారని, మధ్యలో బ్రహ్మానందం చిత్రం పెట్టారని, వీళ్లకసలు సిగ్గుందా, బుద్ధుందా అంటూ మండిపడ్డారు. ఇవేకాదు, ఇలాంటివే అనేక చిత్రాలను చంద్రబాబు మీడియాకు ప్రదర్శించారు. ఫర్నిచర్ దొంగల పార్టీ అంటూ పోస్టర్లు వేస్తున్నారని, రూ.43 వేల కోట్లు దోచుకున్న మీరా మమ్మల్ని అనేది? అంటూ నిలదీశారు.