Andhra Pradesh: ఏపీలో బార్ల విషయంలో మరో 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం: మంత్రి నారాయణస్వామి వెల్లడి
- చంద్రబాబు పదేళ్లవరకు అనుమతులు ఇచ్చారని వెల్లడి
- ఏపీలో కొత్త మద్యం విధానం
- మద్యం షాపులు ప్రభుత్వ అధీనంలో నడుస్తాయన్న మంత్రి
రాష్ట్రంలో నేటి నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను 20 శాతం తగ్గించామని, దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామని స్పష్టం చేశారు. మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయని, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయని వివరించారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామని వ్యాఖ్యానించిన మంత్రి, నాటుసారా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మున్ముందు మద్యపాన నిషేధంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్ముతామని చెప్పారు. అయితే, రాష్ట్రంలో బార్ల విషయంలో మరో 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల వరకు బార్లకు అనుమతిచ్చారని నారాయణస్వామి వెల్లడించారు. దీనిపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.