Crime News: భర్తను కాదంది...ప్రియుడితో సయ్యంది.. జీవితం విషాదాంతమైంది!

  • ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిపై మోజు
  • అతనితో సహజీవనం చేసినా పెళ్లికి నిరాకరణ
  • మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య
జీవితం ఒకసారి దారితప్పితే ముగింపు ఎలా ఉంటుందనేందుకు ఆమె ఉదాహరణ. ఇంట్లో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని కాదని భర్తకు విడాకులు ఇచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిపై మోజుపడి అతనితో రెండేళ్లుగా సహజీవనం చేస్తోంది. మోజుతీరాక అతను పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళితే...తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి చెందిన చేబ్రోలు విమల (24)కు 2017లో కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. భర్తతో కాపురానికి వెళ్లిన విమల అతనితో సరిపోవడం లేదంటూ మూడు నెలలకే వదిలి వచ్చేసింది. అనంతరం భర్త నుంచి విడాకులు తీసుకుంది. పుట్టింట్లో ఉండగా ఫేస్‌బుక్‌లో ఆమెకు కరీంనగర్‌ జిల్లా పోరండ్లకు చెందిన పవన్‌కుమార్‌తో పరిచయం అయ్యింది. ఈ పరిచయం కాస్తా శారీరకంగా ఒక్కటయ్యేందుకు దారితీసింది.

దీంతో కరీంనగర్‌లోనే ఇల్లు అద్దెకు తీసుకుని రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఎన్నాళ్లీ సహజీవనం అనుకున్న విమల పెళ్లి చేసుకోవాల్సిందిగా పవన్‌ను కోరింది. అతను మాయమాటలతో వాయిదా వేస్తూ వస్తుండడంతో ఇటీవల గట్టిగా నిలదీసింది. దీంతో అతను తన మనసులో మాట చెప్పేశాడు. ‘ఇప్పటికే నువ్వు పెళ్లయి విడాకులు తీసుకున్న దానివి. నీతో నాకు పెళ్లేంటి? నచ్చితే ఇష్టమైనన్నాళ్లు కలిసి కాపురం చేద్దాం. జీవితాన్ని ఎంజాయ్‌ చేద్దాం. ఆ తర్వాత ఎవరి దారి వారిదే’ అని తెగేసి చెప్పేసరికి హతాశురాలైంది.

ప్రియుడి మనస్తత్వం అర్థంకావడంతో తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు ఆత్మహత్యకు పవన్‌కుమారే కారణమని విమల తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Crime News
women suicide
badrachalam

More Telugu News