garikapati narasimharao: ‘గరికపాటి’ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలి: బాలల హక్కుల సంఘం డిమాండ్

  • పిల్లల్ని ఉపాధ్యాయులు దండించడం తప్పుకాదన్న గరికపాటి
  • తీవ్రంగా స్పందించిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు 
  • ఆయన వ్యాఖ్యలు ఉపాధ్యాయులకు ఊతమిస్తాయన్న అచ్యుతరావు
ఉపాధ్యాయులు పిల్లలను కొట్టడం తప్పుకాదని, దానిని తల్లిదండ్రులు ప్రశ్నించడం సరికాదంటూ ప్రముఖ ప్రవచనకర్త, అవధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని హింసించే ఉపాధ్యాయులకు గరికపాటి వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చే అవకాశం ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. గరికపాటి వ్యాఖ్యలపై తాజాగా బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు స్పందించారు. ఆయన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

గరికపాటి తన ప్రవచనాల ద్వారా పిల్లలకు మనోభావాలు ఉండవని చెప్పడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు పిల్లలను అయినదానికీ, కానిదానికీ హింసించే టీచర్లకు మరింత బలం ఇచ్చేలా ఉన్నాయని ఆరోపించారు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని పిల్లలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. కాగా, ఇటీవల గరికపాటి ప్రవచనం చెబుతూ పిల్లలను టీచర్ కొడితే తప్పులేదని, ఆయన కొట్టారని ఇంట్లో చెబితే తల్లిదండ్రులు మళ్లీ దండించాలి తప్పితే ఉపాధ్యాయులను ప్రశ్నించడం సరికాదని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
garikapati narasimharao
children
teacher

More Telugu News