Guntur District: కరకట్టపై అక్రమ నిర్మాణాలు.. పాతూరు కోటేశ్వరరావు నిర్మాణం కూల్చివేత

  • కృష్ణానది కరకట్టపై 24 అక్రమ నిర్మాణాల గుర్తింపు
  • సీఆర్డీఏ నోటీసులు జారీ
  • సహేతుకంగా లేని వివరణలు ఐదు

కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలో నదికి సమీపంలోని పాతూరు కోటేశ్వరరావు నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని ఈరోజు కూల్చివేశారు. సంబంధిత అధికారుల నుంచి, రివర్ కన్జర్వేటర్ నుంచి ముందస్తు అనుమతులు లేకుండా ఈ నిర్మాణాన్ని చేపట్టారని, ఈ విషయమై జూన్ 6న నోటీసులు జారీ చేసినట్టు సంబంధిత సీఆర్డీఏ అధికారులు చెప్పారు. సదరు భవన యజమాని ఇచ్చిన వివరణలో సహేతుకత లేకపోవడంతో ఈ నిర్మాణాన్ని కూల్చేసినట్టు సమాచారం.

కాగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై కఠిన చర్యలు చేపడతామని సీఆర్డీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. కృష్ణానది కరకట్టపై 24 అక్రమ నిర్మాణాలను ప్రాథమికంగా గుర్తించారు. ఆయా నిర్మాణాల యజమానులకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. అందులో, ఐదు భవనాలకు చెందిన యజమానులు ఇచ్చిన వివరణలు సహేతుకంగా లేకపోవడంతో చర్యలకు సిద్ధమయ్యారు. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

More Telugu News