Nara Lokesh: కడుపుకు అన్నం తింటున్నారా? లేక, అవినీతి భోంచేస్తున్నారా?: ఉపముఖ్యమంత్రులపై లోకేశ్ ఆగ్రహం

  • గ్రామ సచివాలయ నియామకాల పేపర్ లీకేజీపై లోకేశ్ స్పందన
  • కులాల రంగు పులుముతున్నారంటూ మండిపాటు
  • జగన్ కు విశ్వసనీయత ఉంటే లీకువీరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా ఘాటుగా స్పందించారు. పేపర్ లీక్ పై చర్యలు తీసుకోవాలని లేఖ రాస్తే, కులాల రంగు పులుముతున్నారంటూ ఉపముఖ్యమంత్రులపై లోకేశ్ మండిపడ్డారు. కడుపుకు అన్నం తింటున్నారా లేక అవినీతి భోంచేస్తున్నారా? అంటూ నిలదీశారు. వెనకటికి ఎవరో, తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకు గడ్డి కోయడానికి అన్నాడని, మీరు కూడా అలాంటివాళ్లేనని ఉపముఖ్యమంత్రులను విమర్శించారు.

వైసీపీ కార్యకర్తల కోసం 18 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు అన్యాయం చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి వేదికలపైనే ప్రకటిస్తుంటే సీఎం జగన్ గారు మౌనంగా ఉండడం సబబు కాదని ట్వీట్ చేశారు. పేపర్ లీకైందన్నది నిజమని, ప్రతిభ ఉన్నవాళ్లకు అన్యాయం జరిగిందన్నదీ నిజమని లోకేశ్ వ్యాఖ్యానించారు. జగన్ కు విలువలు, విశ్వసనీయత ఉంటే పేపర్ లీక్ చేసినవాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కుల రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేయవద్దంటూ హితవు పలికారు.
Nara Lokesh
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Jagan

More Telugu News