Andhra Pradesh: ఏపీలో గ్రామ సచివాలయం ఉద్యోగాల పేపర్ లీక్.. ‘అవినీతిపరుడికి అధికారం ఇస్తే’.. అంటూ విరుచుకుపడ్డ చంద్రబాబు!

  • ఆంధ్రజ్యోతి పత్రిక సంచలన కథనం
  • అవినీతి పరుడికి అధికారమిస్తే పెద్ద అవినీతి చేస్తాడు
  • ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం నిరూపించింది
  • జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు, సచివాలయం ఉద్యోగాల పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ఈరోజు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఓ అవినీతిపరుడికి అధికారం ఇస్తే ఇంకా పెద్ద అవినీతి జరుగుతుందని జగన్ ప్రభుత్వం నిరూపించిందని దుయ్యబట్టారు. నిన్నటికి నిన్న గ్రామ వాలంటీర్ పోస్టులన్నింటిని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకుని నిరుద్యోగులను మోసం చేశారనీ, ఉత్తుత్తి ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ల ఆశలను ఆవిరి చేశారని విమర్శించారు.

ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసి భారీ స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘లక్షలాది నిరుద్యోగులను దగా చేశారు. వారి భవితకు ఉరి వేశారు. ఏంటి తమాషాలా?  రాష్ట్రంలో  ఏం జరుగుతోంది? మోసపోయిన నిరుద్యోగులకు ఏ రకంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత వరుస ట్వీట్లు చేశారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Twitter
Gramasachivalayam
Question paper
Leakage

More Telugu News