Andhra Pradesh: కోడెలను మూడు నెలల పాటు వేధించారు: చంద్రబాబు ఫైర్

  • టీడీపీ నేతలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు
  • ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారు
  • వైసీపీ ప్రభుత్వంపై బాబు ఫైర్
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును మూడు నెలల పాటు వేధించారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వైఖరిపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోడెలపై సామాజిక మాధ్యమాల్లో విషప్రచారం చేశారని ఆరోపించారు.

టీడీపీ నేతలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, వైసీపీ నేతలు చెప్పినట్టుగా పోలీసులు వారికి సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నిరకాలుగా భయపెట్టి ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇంకొంతమంది నేరస్తులు కలిసి సోషల్ మీడియాను రెచ్చగొట్టారని, సంబంధం లేని సివిల్ కేసుల్లోనూ కోడెల కుటుంబసభ్యులను వేధించారని ఆరోపించారు.

సభాపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ విప్ లకు ప్రభుత్వం ఫర్నిచర్ ఇవ్వడం సాధారణమని అన్నారు. ఎన్నికల తర్వాత అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే కనుక ఆ పార్టీ నేతల దగ్గర ఉండే ఫర్నిచర్ ను తిరిగి ప్రభుత్వానికి పంపాలని, ఈ పనులన్నింటినీ  ప్రత్యేక సిబ్బంది, ప్రైవేట్ సెక్రటరీ చూసుకుంటారని అన్నారు. అసెంబ్లీ ఫర్నిచర్ ను కోడెల తన ఇంటికి తరలించారన్న కేసులో ఏదేదో ఊహించుకున్నారని విమర్శించారు. ఈ ఫర్నిచర్ ను తీసుకెళ్లమని కోరుతూ ప్రభుత్వానికి ఆయన ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
Andhra Pradesh
YSRCP
Telugudesam
Chandrababu

More Telugu News