Andhra Pradesh: ఇన్ని ఉద్యోగాలు కల్పించడం ఓ రికార్డు.. అభ్యర్థులకు మంచి శిక్షణ ఇస్తాం!: సీఎం జగన్

  • రికార్డు సమయంలో పరీక్షలను పూర్తిచేశారు
  • అధికారులకు సీఎం అభినందనలు
  • విధుల్లో అంకితభావంతో పనిచేయాలని సూచన
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. పరీక్షలు విజయవంతంగా నిర్వహించి ఫలితాలను విడుదల చేసిన అధికారులను అభినందించారు. అధికారులు రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తిచేశారని కితాబిచ్చారు. ఏకకాలంలో ఇన్ని ఉద్యోగాలు కల్పించడం అన్నది ఓ రికార్డని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని తాము నిలబెట్టుకున్నామని చెప్పారు.  

ఒకే నోటిఫికేషన్ ద్వారా 1,26,728 శాశ్వత ఉద్యోగాలను కల్పించడం చరిత్రలో తొలిసారని వ్యాఖ్యానించారు. పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు జగన్ తెలిపారు. అభ్యర్థులకు తాము మంచి శిక్షణ అందజేస్తామనీ, శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు ప్రజాసేవలో మమేకం కావాలని సూచించారు. గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని చెప్పారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే చేరుస్తామన్నారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
Gramasachivalayam
Results

More Telugu News