Tamil Nadu: కానిస్టేబుల్‌ అత్యుత్సాహం...సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థికి హెల్మెట్‌ ఏదంటూ చుక్కలు చూపిన వైనం

  • జరిమానా చెల్లించాలంటూ డిమాండ్‌
  • అయోమయానికి గురైన బాలుడు
  • గంటపాటు రోడ్డుపైనే నిలబెట్టి అనంతరం విడుదల

ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేయాలన్న ఆలోచనతో ఓ కానిస్టేబుల్‌ అత్యుత్సాహం ప్రదర్శించడంతో సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థికి చుక్కలు కనిపించాయి. హెల్మెట్‌ ఏదంటూ సదరు విద్యార్థిని దబాయించడమేకాక జరిమానా చెల్లించాలంటూ డిమాండ్‌ చేయడంతో ఆ బాలుడు అయోమయానికి గురయ్యాడు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోకు సంబంధించిన వివరాలు ఇవీ.

తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పెన్నాగరం మండలం ఏరియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ సుబ్రమణి నేతృత్వంలో నిన్న వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు అతిక్రమించిన వాహన చోదకులకు జరిమానా విధిస్తున్నారు. ఆ సమయంలో ఓ విద్యార్థి సైకిల్‌పై పాఠశాలకు వెళ్తున్నాడు. అక్కడ తనిఖీ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ విద్యార్థిని ఆపి హెల్మెట్‌ ఎక్కడంటూ సైకిల్‌ స్వాధీనం చేసుకున్నాడు. జరిమానా చెల్లిస్తే తప్ప విడిచి పెట్టేది లేదని చెప్పడంతో దిక్కుతోచని విద్యార్థి తండ్రికి సమాచారం ఇచ్చాడు.

ఈలోగా దాదాపు గంటపాటు విద్యార్థిని రోడ్డుపైనే నిలబెట్టి అనంతరం అతన్ని విడిచి పెట్టాడా కానిస్టేబుల్‌. ఇదంతా సమీపంలోని ఓ భవనంపై ఉన్న వ్యక్తి వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. కాగా, సదరు విద్యార్థి రెండు చేతులు హ్యాండిల్‌పై నుంచి తీసేసి సైకిల్‌ తొక్కుకుంటూ రావడంతో హెచ్చరించేందుకు అతన్ని ఆపినట్టు పోలీసులు చెబుతున్నారు.

More Telugu News