SYRA: రాంచరణ్ ఆఫీసు ముందు ‘ఉయ్యాలవాడ’ వారసుల ధర్నా.. పోలీస్ స్టేషన్ కు తరలింపు!

  • ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామన్నారు
  • అగ్రిమెంట్ కూడా చేసి, ఇప్పుడు మోసం చేస్తున్నారు
  • మెగా ఫ్యామిలీపై మండిపడ్డ ఉయ్యాలవాడ వారసులు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు ముందే అనేక అవాంతరాలను ఎదుర్కొంటోంది. తాజాగా తమకు న్యాయం చేయాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడెక్షన్స్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో చిరంజీవి కుటుంబ సభ్యులపై ఉయ్యాలవాడ కుటుంబంలో ఐదో తరం వారసులైన దొరవారి దస్తగిరిరెడ్డి, లక్ష్మి కుమారి ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ ఏడాది మే నెలలో నిర్మాత, హీరో రాంచరణ్ పీఏ అవినాష్, స్వామినాయుడు తమను చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు పిలిపించారని  దొరవారి దస్తగిరిరెడ్డి, లక్ష్మి కుమారి తెలిపారు. ‘ఉయ్యాలవాడ వంశీకులు 22 మందికి మొత్తం రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు.

అయితే ఇప్పటివరకూ మాకు న్యాయం చేయలేదు. గట్టిగా అడిగితే గత నెల 16న ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు రాంచరణ్ పీఏ అవినాష్ ‘మీకెలాంటి హక్కులు లేవు’ అంటూ మోసం చేశాడు. నోటరి చేసినప్పుడు 15 రోజుల్లోగా నగదు ఇస్తామన్నారు. ఇంకా ఇవ్వనేలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సైరా నరసింహారెడ్డి సినిమాను అక్టోబర్ 2న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

More Telugu News