Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో సేవలను పునరుద్ధరించండి: కేంద్రానికి సుప్రీం సూచన

  • జమ్మూకశ్మీర్ అంశంపై దాఖలైన వివిధ వ్యాజ్యాలను విచారించిన సుప్రీంకోర్టు
  • ప్రాధాన్యాలను బట్టి సేవలను పునరుద్ధరించాలని సూచన
  • ఆదేశాలు కావు.. సూచనలు మాత్రమేనని స్పష్టీకరణ
జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అక్కడి ప్రజలకు వీలైనంత త్వరగా విద్య, వైద్య, ప్రజా రవాణా, సమాచార సేవలను పునరుద్ధరించాలని కోరింది. జాతీయ ప్రయోజనాలు, అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.

 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అన్నీ ఒక్కసారిగా కాకపోయినా ప్రాధాన్యాలను బట్టి సేవలను పునరుద్ధరించాలని, తొలుత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరింది. జమ్మూకశ్మీర్ అంశంపై దాఖలైన వివిధ వ్యాజ్యాలను విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి సూచించింది.

ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలు వినిపిస్తూ జమ్మూకశ్మీర్ ప్రజలకు వైద్య సదుపాయాలు అందుతున్నాయంటూ గణాంకాలతో సహా వివరించారు. న్యాయస్థానం కనుక ఆదేశాలు ఇస్తే ఇతర దేశాలు వాటిని వక్రీకరించే అవకాశం ఉందన్నారు. దీంతో స్పందించిన న్యాయస్థానం తాము ఆదేశాలు ఇవ్వడం లేదని, కేవలం సూచన మాత్రమే చేశామని స్పష్టం చేసింది.
Jammu And Kashmir
Supreme Court
article 370

More Telugu News