Andhra Pradesh: పెయిడ్ ఆర్టిస్టులు ఫెయిలయ్యారు.. అందుకే పవన్ కల్యాణ్ ను దించారు!: వైసీపీ నేత రోజా సెటైర్లు

  • చంద్రబాబు పాలనలో పవన్ కళ్లుమూసుకున్నారు
  • ఇప్పటివరకూ బాబుకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు
  • చిత్తూరులో మీడియాతో ఏపీఐఐసీ చైర్మన్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాలనలో ఐదేళ్ల పాటు పవన్ కల్యాణ్ కళ్లు మూసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా తెలిపారు. చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో ఆడిన డ్రామాలు బట్టబయలు కావడంతో, పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించారని విమర్శించారు. 2014 నుంచి ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూనే ఉన్నారని దుయ్యబట్టారు. చిత్తూరులో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పాలనలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 80 శాతం హామీలు అమలు చేశామని వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో వైఎస్ జగన్ ను ప్రజలు గెలిపించారని తెలిపారు. ఇది తిరగబడ్డా 151 అవుతుందని జనసేన విమర్శలను తిప్పికొట్టారు. అసెంబ్లీ ఒకేఒక సీటు గెలుచుకున్న పవన్ కల్యాణ్ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు పాఠాలు విని, కొత్త రాగాలు అందుకున్న పవన్ కల్యాణ్ కు అసలు జగన్ పాలనపై మాట్లాడే హక్కే లేదని స్పష్టం చేశారు.
Andhra Pradesh
YSRCP
roja
Chittoor District

More Telugu News