Andhra Pradesh: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 500 మంది మహిళలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు!

  • ప్రజల మన్ననలు అందుకునేలా పనిచేయాలని సూచన
  • టీడీపీ హయాంలోనే ఈ పరీక్ష జరిగిందన్న లోకేశ్
  • ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసుకోవాలని ఆకాంక్ష

ఆంధ్రప్రదేశ్ లో 2,623 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను ఏపీ హోంమంత్రి సుచరిత నిన్న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో అమరావతిలో విడుదల చేశారు. తాజాగా ఈ ఫలితాల ప్రకటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు.

కానిస్టేబుల్ పరీక్షల్లో  ఉత్తమ ర్యాంకర్లుగా నిలిచిన మాడెం లక్ష్మీ ప్రియాంక, జింకా శశికుమార్, చల్లా సత్యనారాయణ, సిద్ధారెడ్డి చెన్నారెడ్డి, వడ్డపల్లి కోటేశ్వరరావులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కానిస్టేబుల్ జాబితాలో ఏకంగా 500 మంది మహిళలు ఉండటం మరింత సంతోషకరమైన విషయమని వ్యాఖ్యానించారు. ప్రజాహక్కుల పరిరక్షణలో, శాంతిభద్రతల నిర్వహణలో వీరి పాత్ర గణనీయమైనదని చెప్పారు. ప్రజల మన్ననలు అందుకునేలా ఉత్తమసేవలు అందించాలని సూచించారు.

మరోవైపు ఈ విషయమై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ.. ‘కానిస్టేబుళ్ళుగా ఎంపికైన విజేతలందరికీ అభినందనలు. టీడీపీ హయాంలో విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని మా ప్రభుత్వ కాలంలోనే తుది రాతపరీక్షలకు హాజరై, తాజాగా ట్రైనింగ్ కు వెళ్తున్న మీ అందరికీ ఈ శిక్షణాకాలం ఉత్సాహవంతంగా గడవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

More Telugu News