Andhra Pradesh: పల్నాడు ప్రాంతం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది: ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత

  • రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎటువంటి ఇబ్బంది లేదు
  • గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయన్నది అబద్ధం
  • అలాంటి పరిస్థితి ఉంటే ప్రశాంతంగా జీవించే ఏర్పాట్లు చేస్తాం
రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎటువంటి ఇబ్బంది లేదని, పల్నాడు ప్రాంతం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందని ఏపీ హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయని, భయాందోళనలతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా టీడీపీ నాయకులపై మండిపడ్డారు.

ఒకవేళ నిజంగా రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉంటే కనుక శాంతి భద్రతలతో జీవించే ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాలకు స్వయంగా ఎస్పీ వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించవద్దని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. ఎన్నికల తర్వాత గ్రామాల్లో 46 మందిపై రౌడీ షీట్లు, 36 మందిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేశామని, రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించామని, రాజకీయ కేసులన్నీ ఎస్పీ ఆధ్వర్యంలో సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్టు తెలిపారు.
Andhra Pradesh
Home minister
Mekathoti
sucharita

More Telugu News