Tamil Nadu: బాలికను కిడ్నాప్ చేసేందుకు యువకుడి యత్నం.. పట్టుకుని చావబాదిన ఉపాధ్యాయులు, విద్యార్థులు

  • తమిళనాడులో ఘటన
  • తరగతిలోకి వచ్చి క్లాస్ టీచర్ మెడపై కత్తి
  • తప్పించుకునే క్రమంలో పట్టుబడిన నిందితుడు
పదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు కలిసి చావబాదిన ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా రాణియల్‌ సమీపంలో జరిగింది. జయరామ్ (23) అనే యువకుడు స్థానిక ప్రైవేటు పాఠశాలలోని పదో తరగతి గదిలోకి వెళ్లాడు. అక్కడో అమ్మాయి పేరు చెప్పి ఆమె తండ్రి చనిపోయాడని, ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చానని చెప్పాడు. అయితే, అతడి తీరుపై అనుమానం వచ్చిన క్లాస్ టీచర్ మరికొన్ని ప్రశ్నలు అడగడంతో తడబడ్డాడు.

దీంతో తన పన్నాగం పారేలా లేదని గ్రహించిన జయరామ్ వెంట తెచ్చుకున్న కత్తిని ఉపాధ్యాయురాలి మెడపై పెట్టి చంపుతానని బెదిరించాడు. దీంతో ఆమె కేకలు పెట్టింది. అది విన్న ఇతర గదుల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు తరగతి గదిలోకి చేరుకున్నారు. వారిని చూసిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు, విద్యార్థులు అతడిని పట్టుకున్నారు. స్థానికులతో కలిసి అతడిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా, గతంలో అదే బాలికను కిడ్నాప్ చేసి అరెస్ట్ అయిన జయరామ్ ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే బాలికను కిడ్నాప్ చేయబోయి దొరికిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tamil Nadu
kidnap
girl

More Telugu News