Telugudesam: టీడీపీ కార్యకర్తలపై దాడులంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు: అంబటి రాంబాబు

  • ఇలాంటి వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి
  • టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు
  • టీడీపీని ఓడించి ప్రజలు పెద్దఎత్తున దాడి చేయలేదా?
టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలను వైసీపీ  నేతలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రేపు టీడీపీ బాధితులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత సహా పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ క్రమమలో నేడు వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు కరెక్టు కాదని అన్నారు. దాడుల కారణంగా పల్నాడు ప్రాంతంలోని టీడీపీ కార్యకర్తలు గ్రామాలు విడిచి వెళుతున్నారని, వాళ్లను తిరిగి గ్రామాల్లోకి రాకుండా చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థ అనుకూలంగా ఉందంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇలాంటి వార్తలు పత్రికల్లో చదివిన తమకు ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించారంటే, ఆ పార్టీ హయాంలో పరిపాలన ఎంత చెండాలంగా ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్న చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధమని అన్నారు.

‘‘అవసరమైతే నాపై దాడి చేయండి’ అని చంద్రబాబు అంటున్నారు. ఆయనపై దాడి చేసే అవసరమేముంది?’ అని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే గెలుచుకున్న టీడీపీపై ప్రజలు ఎంత పెద్ద ఎత్తున దాడి చేశారు? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ జరగనంత అవమానం టీడీపీకి జరిగిందని, తిరిగి ఆ పార్టీ కోలుకునే స్థితిలో లేదని ఆ పార్టీ క్యాడరే భావిస్తోందని వ్యాఖ్యానించారు.
Telugudesam
Chandrababu
Ambati
Rambabu
YSRCP

More Telugu News