Nara Lokesh: మీ కార్యకర్తలు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీద పడి రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు: జగన్ పై లోకేశ్ ఫైర్

  • వైసీపీ బాధితుల పునరావాస శిబిరాన్ని సందర్శించిన లోకేశ్
  • ఒక్కొక్కరి బాధ వింటుంటే గుండె తరుక్కుపోతోంది అంటూ వ్యాఖ్యలు
  • సీఎం నిమ్మకు నీరెత్తినట్టున్నారని విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన విమర్శలకు మరింత పదును పెట్టారు. 'వైఎస్ జగన్ గారూ, మీ కార్యకర్తలు, నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీద పడి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు' అంటూ మండిపడ్డారు. 'ఇంత జరుగుతున్నా మీరేమో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలను గాలికి వదిలేశారు' అంటూ ఆరోపించారు. 'ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం మౌనం పాటిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది... ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?' అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ ఇబ్బందులు పెడుతున్నారని, అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. 100 రోజులు ఓపిక పట్టామని, ఇక సహించేది లేదని హెచ్చరించారు. పిన్నెల్లిలో 200 మందిపై ఒక్కొక్కరి మీద 4 అక్రమ కేసులు పెట్టారని అన్నారు. వైసీపీ నీచ రాజకీయ కక్షలకు టీడీపీ సానుభూతిపరులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి బాధ వింటుంటే గుండె తరుక్కుపోతోందని, వారికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చామని తెలిపారు.

బాధిత కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థికసాయంగా అందిస్తున్నామని, వారి పిల్లలకు ఉన్నత విద్య అందిస్తామని వెల్లడించారు. గ్రామాలను వీడిన వారికి రక్షణ కల్పించాలని, ఈ నెల 11 నాటికి తిరిగి వారిని గ్రామాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రక్షణ కల్పించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News