Andhra Pradesh: బెల్టు షాపులను సమూలంగా రూపుమాపిన ప్రభుత్వం మాదే: ఏపీ మంత్రి నారాయణస్వామి

  • ఇండ్లాస్ శాంతివనాన్ని సందర్శించిన అబ్కారీ మంత్రి
  • మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించామంటూ వ్యాఖ్యలు
  • మద్య నిషేధ ఉద్యమానికి అన్ని పార్టీలు సహకరించాలంటూ విజ్ఞప్తి
ఏపీ అబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామి ఇవాళ కృష్ణా జిల్లా నున్నలో ఉన్న ఇండ్లాస్ శాంతివనాన్ని సందర్శించారు. మద్యపానం, ఇతర వ్యసనాల బారినపడిన వాళ్లకు ఇక్కడ చికిత్స ఇస్తారు. ఈ నేపథ్యంలో, మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, మద్యనిషేధంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దుకాణాల సంఖ్యను తగ్గించామని చెప్పారు. మద్యం బెల్టు షాపులను సమూలంగా రూపుమాపిన ప్రభుత్వం తమదేనని వెల్లడించారు.

మద్యం వ్యసనం కారణంగా కుటుంబాలను నిర్వీర్యం చేసుకున్న బాధితులకు తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరఫున సహకారం అందించే విషయంలో తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మానసిక పరివర్తన కేంద్రాల్లో చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తింపు విషయం పరిశీలనలో ఉందని మంత్రి నారాయణస్వామి తెలిపారు. మద్యపాన నిషేధం ఉద్యమానికి అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Andhra Pradesh
Narayanaswami

More Telugu News