USA: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ప్రముఖ హాలీవుడ్ నటుడు కెవిన్ హర్ట్ కు తీవ్రగాయాలు!

  • ప్రమాదం అనంతరం మరో కారులో వెళ్లిపోయిన కెవిన్
  • స్నేహితుడిని హెలికాప్టర్ లో తరలించిన అధికారులు
  • అదుపుతప్పడంతో పల్టీలు కొట్టిన కారు
ప్రముఖ హాలీవుడ్ నటుడు, కమెడియన్ కెవిన్ హర్ట్(40) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ముల్హోల్యాండ్ రహదారిపై కెవిన్, ఆయన స్నేహితులు ప్రయాణిస్తున్న కారు నిన్న అర్ధరాత్రి దాటాక బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కెవిన్ తో పాటు వాహనాన్ని నడుపుతున్న అతని స్నేహితుడు జెరెడ్ బ్లాక్(28)కు నడుము భాగంలో తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కెవిన్ స్నేహితుడిని పెట్రోలింగ్ పోలీసులు.. హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు కెవిన్ వ్యక్తిగత సిబ్బంది ఆయన్ను ఘటనాస్థలి నుంచి కారులో తీసుకెళ్లిపోయారు. కాగా, ప్రమాద సమయంలో కెవిన్ తో పాటు బ్లాక్, రెబెక్కా అనే ఇద్దరు స్నేహితులు కారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పడంతో పక్కనే ఉన్న ఫెన్సింగ్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టిందని వెల్లడించారు. ఈ ఘటనలో కారు టాప్ పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం కెవిన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సన్నిహితవర్గాలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
USA
LA
Road Accident
KEVIN HART
SERIOUSLY INJURED

More Telugu News