Jagan: సీఎం జగన్ కు మూడు పేజీల లేఖ రాసిన చంద్రబాబు

  • కృష్ణా నది వరదల గురించి లేఖలో ప్రస్తావన
  • తన నివాసానికి నోటీసులు, డ్రోన్లు ఎగరేయడంపై చూపిన శ్రద్ధ వరద బాధితులపై చూపలేదని విమర్శలు
  • రాజధానికి ముంపు ప్రమాదం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై అనుమానాలున్నాయన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ కు మూడు పేజీల సుదీర్ఘమైన లేఖ రాశారు. ప్రధానంగా కృష్ణా నదికి వరదలు, పర్యవసానాలను తన లేఖలో పేర్కొన్నారు. వరదల సందర్భంగా ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. వరద నీటిని నియంత్రించడం నుంచి బాధితులను ఆదుకోవడం వరకు అన్నింటా ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని ఆరోపించారు.

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై ఐఎండీ వంటి వాతావరణ సంస్థలు ముందే హెచ్చరించినా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదంటూ ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్ లో ముందే నీటి మట్టం తగ్గించి ఉంటే లంక గ్రామాలు వరద బారిన పడేవి కావని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కానీ, ప్రభుత్వం ఉన్నట్టుండి దిగువకు నీటిని వదలడంతో లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయని వివరించారు. ఇవన్నీ నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలని స్పష్టం చేశారు.

అమరావతిలోని తన నివాసానికి నోటీసులు పంపడం, డ్రోన్లు ఎగరేయడంపై చూపిన శ్రద్ధ వరద బాధితులపై ప్రదర్శించలేదని తెలిపారు. చివరికి రాజధానికి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేశారని, ఇది కావాలనే చేసినట్టుగా తమకు అనుమానాలున్నాయని లేఖలో స్పష్టం చేశారు.
Jagan
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News