Nagarkurnool District: ఘరానా దొంగగా మారిన మాజీ కానిస్టేబుల్ కు మూడేళ్ల జైలు శిక్ష

  • పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మాజీ కానిస్టేబుల్ 
  • పదేళ్లుగా హైదరాబాద్‌లో విధులు
  • జైలు శిక్షతో పాటు భారీ జరిమానా
ఘరానా దొంగగా మారి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మాజీ కానిస్టేబుల్‌కు కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండకు చెందిన  రత్లావత్‌ అమర్‌సింగ్‌ 1990లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అనంతరం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని బెటాలియన్‌లో పదేళ్లపాటు విధులు నిర్వర్తించాడు.

అనంతరం స్వగ్రామంలో ఉంటున్న భార్య సర్పంచిగా ఎన్నికవడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన రత్లావత్ సొంతూరికి వెళ్లిపోయాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న రత్లావత్ ఆ తర్వాత విలాసవంతమైన జీవితానికి, మద్యానికి అలవాటు పడ్డాడు. అయితే, సంపాదిస్తున్న సొమ్ము సరిపోకపోవడంతో 2010 నుంచి చోరీలబాట పడ్డాడు.

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో చాకచక్యంగా దొంగతనాలు చేసి తప్పించుకునేవాడు. అతడిపై మొత్తం 42 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీసులకు దొరికి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోలేదు. 8 నెలల క్రితం ఎల్‌బీనగర్ ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. అతడి కోసం నిఘా పెంచిన పోలీసులు జనవరి 29న అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. మార్చి 5న అతడిపై పీడీ చట్టం కింద కేసు నమోదైంది. తాజాగా ఎల్బీనగర్ సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్‌ కోర్టు శుక్రవారం రత్లావత్‌ను 14 కేసుల్లో దోషిగా నిర్ధారించి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కో కేసుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
Nagarkurnool District
constable
thief
Telangana

More Telugu News