DK Shivakumar: నేనేమీ అత్యాచారం లాంటి నేరానికి పాల్పడలేదు.. ఎవరూ టెన్షన్ పడొద్దు: డీకే శివకుమార్

  • మనీలాండరింగ్ కేసులో నిన్న రాత్రి శివకుమార్ కు ఈడీ సమన్లు
  • ఈ మధ్యాహ్నం విచారణకు హాజరుకానున్న శివకుమార్
  • విచారణకు పూర్తిగా సహకరిస్తానని వ్యాఖ్య
మనీ లాండరింగ్ కేసులో ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్  విచారణకు హాజరుకానున్నారు. ఈడీ పంపిన సమన్లపై శివకుమార్ వేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో... నిన్న రాత్రి ఆయనకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ఆయన విచారణకు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా ఈ ఉదయం బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, 'నేను టెన్షన్ పడడం లేదు. ఎవరూ టెన్షన్ పడొద్దు. నేను ఏ తప్పూ చేయలేదు. అత్యాచారం వంటి నేరం కానీ, ఎవరి వద్ద నుంచైనా డబ్బు తీసుకోవడం కానీ చేయలేదు. నాకు వ్యతిరేకంగా ఏమీ లేదు' అన్నారు.

మరోవైపు, ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా కూడా ఆయన స్పందించారు. 'నిన్న రాత్రి 9.40 గంటలకు ఈడీ సమన్లను అందుకున్నా. ఢిల్లీలో ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు హాజరుకావాలని అందులో ఉంది. విచారణకు హాజరుకావాలంటూ హఠాత్తుగా సమన్లు ఇవ్వడం సరైన చర్య కాకపోయినా... చట్టంపై ఉన్న గౌరవంతో నేను విచారణకు హాజరవుతాను. విచారణకు పూర్తిగా సహకరిస్తా' అని తెలిపారు.
DK Shivakumar
Karnataka
Congress
ED

More Telugu News