Andhra Pradesh: ఇలాంటి దుష్ప్రచారం ఆపకపోతే టీడీపీకి వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవు: మంత్రి కొడాలి నాని

  • టీడీపీ హయాంలో ‘పోలవరం’, అమరావతి భజన చేశారు
  • వీటి నిర్మాణాలను కొనసాగించమన్నది దుష్ప్రచారం  
  • యావత్తు రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం
ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని, ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ హయాంలో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు పొద్దున్న ‘పోలవరం’ గురించి, మధ్యాహ్నం ‘అమరావతి’ గురించి భజన చేయడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. టీడీపీని చంద్రబాబు సర్వనాశనం చేశారని, అయినా ఆయనకు బుద్ధిరాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు కూడా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు గురించి, రాజధాని అమరావతి గురించి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలను తమ ప్రభుత్వం కొనసాగించదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారం చేయడం టీడీపీ కనుక ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.

‘పోలవరం’ కాంట్రాక్టుల కోసం, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తమ ప్రభుత్వం పని చేయదని, యావత్తు రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడుతోందని స్పష్టం చేశారు.
Andhra Pradesh
amaravathi
minister
Kodali Nani

More Telugu News